మొన్న ఎండాకాలం సెలవుల్లో కోతికొమ్మంచి ఆడుతుంటే నా స్నేహితుడుకు దెబ్బతగిలింది. కాలికి అయిన గాయం చిన్నదే కదా అని పట్టంచుకోలేదు. మూడు నాలుగు రోజుల్లో చీము పట్టి సలవటం మొదలుపెట్టింది. అప్పట్నుంచి మా వాడు పప్పు తినడం మానేశాడు. అదేమిట్రా అంటే, అసలు పప్పు తిన్నందుకే ఇలా చీము వస్తుందని, లేకుంటే ఎప్పుడో మానిపోయేదని చబుతున్నాడు. పప్పు తినడం మానేస్తే దానికదే మానిపోతుందని చెబుతున్నాడు. అప్పుడప్పుడు గాయంను పిన్నుతో గుచ్చి తెల్లగా ఉండే చీమును కూడా తీస్తున్నాడు. అసలు చీమెందుకు పడుతుంది? పప్పు తింటే చీమెస్తుందా? అని మా క్లాసులో ఒక చర్చే దరిగింది. కొందరు ఔనని, మరికొందరు కాదని వాడివేడిగా వాదించుకున్నాము. చివరకు మేమందరం మా సైన్స్ మాస్టారును అడిగి నిజం తెలుసుకోవాలనే నిర్ణయానికి వచ్చాము.
మా సైన్స్ మాస్టారు మా సందేహాలకు సమాధానం చెబుతూ ముందుగా ఇదొక మూఢనమ్మకం అని చెబితే ఓహో అలాగా అనుకుంటారు. మాస్టారు కాబట్టి తలలూపి వెళ్ళిపోతారు. నేను చీముకు పప్పుకు సంబంధం లేదని చిటికెలో చేల్చేయగలను. కాని మీరు స్వయంగా హేతుబద్దంగా ఆలోచించే మార్గాన్ని చెబుతాను. మీరే నిజనిజాలు తేల్చుకోగలుగుతారు. ఈ ఒక్క విషయమే కాదు దేన్నైనా శాస్త్రీయ దృష్టితో చూస్తే సరైన అవగాహన ఏర్పడుతుంది. దెబ్బ తగిలినప్పుడు, గాయాలు ఏర్పడినప్పుడు అప్పుడప్పుడు అక్కడ చీము పట్టడం చూస్తుంటాము. పప్పు కూడా ఎప్పటిలాగే తింటాము. కాని అదేమిటో పప్పు తిన్నందుకే చీము పట్టిందనుకుంటాం. పప్పే చీముకు కారణమైతే పప్పు తిన్న ప్రతీసారీ పట్టాలి కదా. కేవలం గాయం సినప్పుడే ఎందుకు జరుగుతుంది? గాయమే కారణం అయితే గాయమైన ప్రతీసారి చీమొస్తుందా? రాదని మేము చెబుతాం. అప్పుడు మాస్టారు దేన్నైనా లోతుగా ఆలోచించాలని, విశ్లేషించాలని చెప్పారు.
సాధారణంగా గాయాలైన్నప్పుడు ఆ ప్రదేశంలో బాక్టీరియంలు చేరి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే చీము ఏర్పడుతుంది. అంటే సూక్ష్మజీవులు చీమును విడుదల చేస్తాయా? మాకు తెలియని విషయం కదా. మిన్నకుండిపోయాం. ఏ రకమైన శత్రుదాడినైనా ఎదిరించి తననుతాను కాపాడుకునే వ్యవస్థ ఒకటి ప్రతీ జీవిలో ఉంటుంది. దీన్నే ఇమ్యూనిటీ లేదా రోగనిరోధక శక్తి అంటారు. మన శరీరంలోని రక్తంలో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తతణాలు, రక్తఫలకికలు వుంటాయని మీకు తెలుసు. తెల్లరక్తకణాలు మనులను ఎల్లప్పుడు సైనికుల్లా రక్షిస్తూ వుంటాయి. ఏదైనా సూక్ష్మజీవో లేదా గాయమో అయినప్పుడు కూడా మన శరీరము రక్షణగా వెంటనే అప్రమత్తమై సైన్సాలను (తెల్లరక్తకణాలను) ఆ ప్రాంతంలో మొహరిస్తుంది. ఇక అందివచ్చున రకరకాల సూక్ష్మజీవులను మింగేసే ఆ కణాలు చేస్తాయి. ఈ క్రమంలో తెల్లరక్తకణాలు కమాలు కూడా చనిపోతాయి. అంటే మన శరీర రక్షణ వ్యవస్థకు, చొరబాటుదారైన (గాయం ద్వారా వచ్చిన) సూక్ష్మజీవులకుమధ్య ఒక రకంగా యుద్దం జరుగుతుందన్నమాట. మరి యుద్దమయ్యాక చంపడం, చనిపోవడం సహజమేకదా. ఆ యుద్ధంలో చనిపోయిన మన తెల్లరక్తకణాలు, అక్కడి కణజాలం, స్రవించిన ప్లాస్మా, ఇంకా మిగిలిపోయిన సూక్ష్మజీవులు వగైరా అన్నీ కలిసి మనం అనుకుంటున్న తెల్లని లేదా పసుపుపచ్చని ద్రవం (చీము) గా వస్తుంది. స్టెఫైలోకోకన్ అనే బాక్టీరియం సాధారణంగా చీము పట్టడానికి కారణమవుతుంది. ఇది అసలు కథ.
గాయం కావడానికి, బాక్టీరియంలకు సంబంధమేమిటి? మేము గాయమై చీము పోస్తుందనుకుంటే మీరేమిటి మాస్టారు అందకుడా, పొందకుండా సమాధానాలు చెబుతారు. పైగా శాస్త్రీయంగా అంటున్నారు. ఇదెలా? మాస్టారు చిరునవ్వు నవ్వి మీరే ఆలోచించండి అన్నారు. కొద్దిసేపు ఆగి మనల తనే బాక్టీరియంలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు? అదే మాకు అర్థం కావటంలేదు అన్నాము. గాయమైనప్పుడు ఆ ప్రదేశంలో దుమ్ము ధూళి చేరుతుంది. అలా చేరుకున్న మట్టి నుండి బాక్టీరియంలు రంగప్రవేశం చేస్తాయి. ఆ తరువాత కథ మీకు తెలిసిందే కదా. ఇప్పుడేమంటారు? పప్పుకీ చీముకి ఏమైనా సంబంధము ఉందా? ఆలోచించండి.
ఇంకో ముఖ్య విషయం. పప్పు తినడం వల్ల చీము పట్టడం జరగదు కానీ గయం మానడానికి మాత్రం పప్పు తినడం చాలా అవసరం. పప్పు అంటే ఏమిటి? మాంసకృత్తులు (ప్రోటీన్స్) పప్పులో మాంసకృత్తులు గాయం మానడానికి అవసరమైన కొత్త కణాలను, కణజాలాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. అందుకనే మనం మూఢనమ్మకాలని వీడకుంటే పప్పులో కాలేస్తాం సుమా!